న్యూఢిల్లీ: రూ. 2 వేలు దాటిన కమర్షియల్ యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) చార్జీలు విధించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 14, 15 తేదీల్లో జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లను రద్దుచేయాలని కోరుతూ బుధవారం అడ్వకేట్ అంజన్ దత్తా ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. తగిన చట్టబద్ధమైన రక్షణలు, పారదర్శకత, ప్రజా సంప్రదింపులు లేకుండానే కేంద్రం ఏకపక్షంగా ఈ చార్జీలను తీసుకొచ్చిందని ఆరోపించారు. కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. వ్యాపారులకు చెల్లించే (పీ2ఎం) రూ.2 వేలు దాటిన సాధారణ యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ వర్తిస్తుంది. రూ. 75 వేలు అంతకంటే ఎక్కువ లావాదేవీలకు ఈ రుసుమును గరిష్టంగా రూ.300గా నిర్ణయించారు. అక్టోబర్ 15 నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది.
